ANDHRA PRADESH: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడు జరుగుతాయి అంటే షెడ్యూల్ ప్రకారమే అని జవాబు వస్తోంది. కార్పోరేషన్ మునిసిపాలిటీలకు సంబంధించిన స్థానిక సంస్థల పదవీ కాలం 2026 మార్చితో ముగుస్తోంది. అలాగే పంచాయతీలు జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు జెడ్పీటీసీలు ఎంపీటీసీల పదవీకాలం జూలైతో ముగుస్తోంది. దాంతో రెండు విడతలుగా ఈ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ముందుగా అర్బన్ ప్రాంతాలలోనే ఎన్నికలు ఉండబోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ జరిగే ఈ ఎన్నికలు ఒక విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొనసాగింపుగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వైసీపీ మీద ప్రచారం :
స్థానిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ విషయంలో ఇప్పటిదాకా ఒక ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. పులివెందుల ఒంటిమెట్ట ఉప ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత పాలక పక్షం తీరు ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తోందని వైసీపీ అధిష్టానమే విమర్శించిన నేపథ్యంలో స్థానిక పోరులో పోటీకి దిగదని ప్రచారం అయితే సాగింది. దీని మీద అనేక రకాలుగా పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి ఈ ప్రచారం మీద పార్టీలో కూడా భిన్న స్వరాలు వాదనలు వినిపించాయని చెబుతారు.
ఓకే చెప్పిన జగన్ :
ఇదిలా ఉండగా ఈ మధ్యనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ స్థానిక ఎన్నికల్లో పోటీకి ఓకే చెప్పారని అంటున్నారు. ఇక మీదట ప్రతీ ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేసి తీరుతుందని మన బలాన్ని చాటుదామని ఆయన పిలుపు ఇచ్చారని చెప్పుకున్నారు. అదే నిజమని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీకి ఉత్సాహ పడుతోంది అని అంటున్నారు.
లాభమే అంటూ :
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల వైసీపీకి లాభమే తప్ప నష్టం ఉండదని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో పోటీ ఉంటే ఆయా ప్రాంతాలలో రాజకీయం కూడా రెండుగా విభజింపబడుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. అంతే కాకుండా క్యాడర్ కూడా ఉత్తేజమవుతుందని పార్టీ ఓటు సాలిడ్ గా నిలుస్తుందని ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం ఉందో అంచనాకు దొరుకుతుందని కూడా అంటున్నారు. అంతే కాదు పార్టీ క్యాడర్ బూత్ లెవెల్ దాకా పటిష్టం అయ్యేందుకు కూడా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
జనం నాడి పట్టేందుకే :
పట్టణ ప్రాంతాలు సాధారణంగా టీడీపీకి మద్దతుగా ఉంటే రూరల్ ప్రాంతాలు వైసీపీకి అండగా ఉంటాయి. కానీ 2024 ఎన్నికల్లో అర్బన్ రూరల్ తేడా లేకుండా అంతా కూటమికే జై కొట్టారు దాంతో వైసీపీకి దారుణమైన పరాజయం లభించింది. అయితే స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా మార్పు ఉంటుందని ఫ్యాన్ పార్టీ భావిస్తోంది. అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలం అవుతుందని లెక్కలేస్తోంది.
పట్టణ ప్రాంతాలలో కూడా ఈసారి మార్పు వస్తుందని విపరీతమైన అప్పులు ఆ స్థాయిలో అభివృద్ధి లేకపోవడం, ఉచితాల పేరుతో సర్కార్ చేస్తున్న విన్యాసాలు ఇవన్నీ చదువరులలో తటస్థులలో చర్చకు వచ్చి తీరుతాయని భావిస్తోంది. దాంతో పోటీ చేస్తే బాగానే ఉంటుందని గెలుపు దక్కే చోట దక్కుతుందని అదే సమయంలో లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు అని వైసీపీ వ్యూహంగా ఉంది.
మొత్తానికి ఎపుడు ఎన్నికలు ప్రకటించినా వైసీపీ సిద్ధమని చెబుతోంది. దాంతో 2026లో మినీ ఎన్నికల సమరం ఏపీలో సాగే అవకాశం ఉంది అని అంటున్నారు.
