ANDHRA PRADESH: పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘గ్లోబల్ టూరిజం అవార్డు - 2025’ రాష్ట్ర పర్యాటక శాఖ గెలుచుకుంది. దేశంలోనే అత్యంత ఆశాజనకమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చేసిన విశేష కృషికి గాను గ్లోబల్ న్యూస్ నెట్‌వర్క్ ఈ అవార్డు అందజేసింది. మంగళవారం ఢిల్లీలోని యశోభూమిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ తరపున టూరిజం కన్సల్టెంట్ నిషితా గోయల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
నూతన పర్యాటక విధానాన్ని రూపొందించడంలో ఏపీ ప్రభుత్వం చూపిన దార్శనిక నాయకత్వంతో ఈ అవార్డు ప్రదానం చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కడప జిల్లాలోని గండికోటను అత్యంత ఆశాజనకమైన పర్యావరణ (ఎకో), సాహస (అడ్వెంచర్) గమ్యస్థానాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో ప్రఖ్యాత సంస్థలతో సంప్రదింపులు చేసి పర్యాటక రంగంలో 103 ఎంవోయూలను కుదుర్చుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ప్రదానం చేసినట్లు గ్లోబల్ న్యూస్ నెట్ వర్కు ప్రకటించింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద పెంచాలని నిర్ణయించింది. సంపద సృష్టించి సంక్షేమ పథకాలకు నిధులు సమీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి సర్కూట్ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బీచ్, టెంపుల్, ఎకో టూరిజంలో ప్రత్యేక సర్క్యూట్‌లను అభివృద్ధికి పీపీపీ విధానంలో చర్యలు తీసుకున్నారు.
ఇక టూరిజం శాఖకు అవార్డు రావడంపై ప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 15 నెలల కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి ఈ అవార్డు ఒక నిదర్శనమని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకే వారంలో రాష్ట్రానికి రెండు అంతర్జాతీయ సంస్థల గుర్తింపు లభించిందని ప్రచారం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అరకు కాఫీకి ఛేంజ్‌మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - 2025 దక్కింది. ఇప్పుడు పర్యాటక శాఖ సాధించిన ప్రగతికి కూడా అదే గుర్తింపు వచ్చిందని అంటున్నారు.

