దసరా 2025 విజయదశమి ముహూర్తం.. జమ్మి చెట్టు పూజ, పాలపిట్ట దర్శనం వెనుక అసలు విషయం ఏమిటంటే?


విజయదశమి 2025: దసరా పండుగ లేదా విజయదశమి పండుగ తెలుగు ప్రజల జీవితాల్లో ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగను అక్టోబర్‌ 2న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. ఈ పండుగ వేళ దుర్గా పూజతో పాటు జమ్మి చెట్టుకు పూజ, పాలపిట్ట దర్శనం కూడా ప్రధానమైనవి. కాబట్టి దసరా పండుగ వేళ విజయ ముహూర్తం, జమ్మి చెట్టు పూజ, పాలపిట్ట దర్శనం విశిష్టత గురించి తెలుసుకుందాం..


అక్టోబర్‌ 2 దసరా పండుగ లేదా విజయదశమి. దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో విజయదశమి పండుగ 2025 జరుపుకోనున్నారు. ఈ దసరా పండుగ 2025 రోజున దుర్గాదేవి ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జమ్మి చెట్టుకు పూజ చేయడం, పాల పిట్టను దర్శించుకోవడం, రావణ దహనం చేయడం వంటి వాటితో పాటు కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్లు ఈ విజయదశమి రోజునే ప్రారంభిస్తారు.

అయితే.. ఈ దసరా రోజున విజయ ముహూర్తం విషయానికొస్తే.. పండితులు చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం 2.09 గంటల నుంచి 2.56 గంటల వరకు ఈ విజయ ముహూర్తం ఉంటుందట. ఈ 47 నిమిషాల కాలం అత్యంత శక్తివంతమైన ముహూర్తమని చెబుతున్నారు. ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారం ప్రారంభించినా, కొత్త పనులు మొదలు పెట్టినా అద్భుతమైన విజయం సాధిస్తారని చెబుతున్నారు.

జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారంటే
దసరా పండుగ రోజు జమ్మి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. అందుకే జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే ఈ జమ్మి ఆకులను ఇంట్లో పూజ గదిలో, బీరువాలో ఉంచడం వల్ల ధనాభివృద్ధి జరుగుతుందని బలమైన విశ్వాసం. అలాగే.. మరికొన్ని శాస్త్రాల ప్రకారం.. జమ్మి చెట్టును దుర్గాదేవి స్వరూపంగా చెబుతారు.

కాబట్టి దసరా పండుగ రోజున జమ్మి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల జీవితంలో కష్టాలు, ఆటంకాలు తొలగిపోయి విజయంతో పాటు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అంతే కాకుండా మరికొన్ని శాస్త్రాలు చెప్పే విషయం ఏమిటంటే.. దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన క్షీర సాగర మథనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు సైతం పుట్టాయని.. వాటిలో జమ్మి చెట్టు కూడా ఒకటని చెబుతారు.

జమ్మి చెట్టును ఆరాధించడం వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే సమయంలో తమ శక్తివంతమైన ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి వెళ్లారట. ఆ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఆ జమ్మి చెట్టుకు పూజలు చేసి తిరిగి తమ ఆయుధాలను తీసుకున్నారట. 

అనంతరం జరిగిన పాండవులు, కౌరవుల భీకర యుద్ధంలో కౌరవులపై పాండవులు విజయం సాధించారట. అప్పటి నుంచి విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టును అపరాజితా దేవిగా భావించి పూజించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతారు.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.