GOLD NEWS: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరో సంచలనం రాబోతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బంగారం ధరలు త్వరలోనే ఊహించని స్థాయికి, అంటే రూ. 2 లక్షలకు కూడా చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే, ఇది కేవలం ఆశ్చర్యం కలిగించే అంశం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
డాలర్‌పై నమ్మకం తగ్గి... బంగారానికి డిమాండ్ పెరిగింది
ప్రపంచవ్యాప్తంగా డాలర్‌పై నమ్మకం క్రమంగా సన్నగిల్లుతుండడమే ఈ పరిణామానికి ప్రధాన కారణం. అమెరికా భారీ స్థాయిలో డాలర్ నోట్లను ముద్రిస్తున్నప్పటికీ, దాని విలువను నిలబెట్టుకోవడం కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో, అనేక దేశాలు తమ ఫారెన్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్స్ ను డాలర్ రూపంలో కాకుండా, అత్యంత విలువైన బంగారం రూపంలో నిల్వచేయడం మొదలుపెట్టాయి.
చైనా, రష్యా, భారత్, సౌదీ అరేబియా వంటి శక్తివంతమైన దేశాలు పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది. డాలర్‌ను ఎప్పుడైనా ప్రింట్ చేయవచ్చు, కానీ బంగారం అనేది ప్రకృతిలోని మైన్స్ నుండే వస్తుంది కాబట్టి, ఇది ఎల్లప్పుడూ అరుదుగా, విలువగా ఉంటుంది. అందుకే, రాబోయే రోజుల్లో బంగారం కేవలం ఆభరణంగా కాకుండా, భవిష్యత్తులో ‘సేఫ్ కరెన్సీ’ గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి బంగారం కొత్త ఆయుధంగా మారుతుందనేది వారి ప్రధాన అంచనా.
ప్రస్తుత ధరలు మరియు పెరుగుదల
ప్రపంచ ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం, రాబోయే రెండేళ్లలో బంగారం ధరలు ఊహించని స్థాయికి పెరిగి, ఒక తులం (10 గ్రాములు) ధర రూ. 2 లక్షలకు చేరుకోవచ్చు. ఇది సాధారణ పెట్టుబడిదారులకే కాకుండా, దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా పెను ప్రభావం చూపనుంది. రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ. 30 వేలకు పైగా ధర పెరిగినట్లు సమాచారం. ఇదే స్థాయిలో పరిస్థితి కొనసాగితే రూ. 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాలలో..
22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 1,08,450, రూ. 1,18,310 ఒకే విధంగా ఉన్నాయి. అయితే, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ. 1,08,650గా నమోదైంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,18,460గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. బంగారం కొనాలనుకునేవారు ఈ ధరలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
నిన్నటితో పోలిస్తే, మంగళవారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,300 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,420 పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ. 1,61,000 వద్ద నమోదై, ఒక్కరోజులో రూ. 1,000 పెరిగింది. పండుగలు, శుభకార్యాల సీజన్ కావడంతో, ఈ ధరల పెరుగుదల తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. బంగారం ధరలు రూ. 2 లక్షలకు చేరుకోవచ్చనే అంచనాల నేపథ్యంలో, చాలా మంది దీన్ని ఒక పటిష్టమైన పెట్టుబడి మార్గంగా పరిగణిస్తున్నారు. అయితే, ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
