‘కాంతార: చాప్టర్-1’ మూవీ రివ్యూ


 Date of Release: 2025-10-02


‘కాంతార: చాప్టర్-1’ మూవీ రివ్యూ 
నటీనటులు: రిషబ్ శెట్టి- రుక్మిణి వసంత్- గుల్షన్ దేవయ్య- జయరాం- ప్రకాష్ తుమినాడ్- షనీల్ గౌతమ్- ప్రమోద్ శెట్టి తదితరులు 
సంగీతం: అజనీష్ లోక్ నాథ్ 
ఛాయాగ్రహణం: అరవింద్ కశ్యప్ 
నిర్మాత: విజయ్ కిరగందూర్ 
రచన-దర్శకత్వం: రిషబ్ శెట్టి 

మూడేళ్ల ముందు ‘కాంతార’ అనే చిన్న కన్నడ సినిమా దేశవ్యాప్తంగా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణ విజయాన్నందుకుంది. ఈ చిత్రంతో నటుడిగా.. దర్శకుడిగా రిషబ్ శెట్టి చూపించిన ప్రతిభకు అందరూ అబ్బురపడ్డారు. ఇప్పుడతను కాంతార ప్రపంచం నుంచి మరో సినిమాతో వచ్చాడు. అదే.. కాంతార చాప్టర్-1. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. 

కథ: వందల ఏళ్ల కిందట భాంగ్రా అనే రాజ్యానికి అధిపతి అయిన రాజు.. ఆ రాజ్యానికి సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలోని కాంతారలో ఉన్న సంపదను అంతా చేజిక్కించుకోవాలని ప్రయత్నించి అంతమవుతాడు. అక్కడి నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆ రాజు తనయుడు విజయేంద్ర (జయరాం) పెరిగి పెద్దవాడై రాజ్యపాలన చేసిన అనంతరం తన కొడుకు కులశేఖరుడికి (గుల్షన్ దేవయ్య) పట్టాభిషేకం చేస్తాడు. కానీ అతడికి పాలన చేతకాదు. కాంతారను నాశనం చేద్దామని ప్రయత్నించిన అక్కడి తెగకు నాయకుడైన బర్మే (రిషబ్ శెట్టి)తో తలపడి ఓడిపోతాడు. కానీ కాంతార మీద భాంగ్రా దాడి అంతటితో ఆగదు. వారి వల్ల కాంతార తెగే అంతమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. 

ఈ అస్థిత్వ పోరాటంలో కాంతార వాళ్లు ఏం చేశారు.. ఈ తెగను బర్బే ఎలా ముందుకు నడిపించాడు.. భాంగ్రా రాజ్యంతో పోటీ పడి కాంతార తన ఉనికిని కాపాడుకుందా లేదా అన్నది. 

మిగతా కథ. 
కథనం-విశ్లేషణ: ఎప్పుడూ చూడని ఒక కథను తెరపైకి తీసుకొస్తే.. విజువల్స్ తో ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తే.. నటనలో మునుపెన్నడూ ఓ కొత్త కోణాన్ని చూపిస్తే.. మనది కాని సినిమాను కూడా ప్రేక్షకులు ఎలా నెత్తిన పెట్టుకుంటారో.. ఎంత గొప్ప ఫలితాన్ని అందిస్తారో చెప్పడానికి ‘కాంతార’ ఉదాహరణ. దక్షిణాదిన ప్రాంతీయ చిత్రాల్లో దిగువన ఉండే కన్నడ సినిమా అయినా.. అందులో హీరోతో అస్సలు పరిచయం లేకపోయినా సరే.. ‘కాంతార’ అందించిన అద్భుత అనుభూతి ప్రేక్షకులను ఒక కొత్త లోకంలో విహరింపజేసింది. అలాంటి అనుభూతి తర్వాత సీక్వెల్ తో అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. కానీ రిషబ్ శెట్టి సీక్వెల్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకోకుండా.. ప్రేక్షకులకు ఇంకా గొప్ప అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో మరింత భారీతనం ఉన్న కథతో వచ్చాడు ఈసారి. 

ఆ భారీతనం ఒక దశ వరకు అనవసరపు ఆర్భాటంలా కనిపించినా.. రిషబ్ చెప్పాలనుకున్న కొత్త కథ కొంతమేర విసిగించినా.. ‘కాంతార’కు బలంగా నిలిచిన డివైన్ ఎలిమెంట్లోకి అతను అడుగు పెట్టగానే మొత్తం మారిపోయింది. మరోసారి రిషబ్ నట విశ్వరూప దర్శనం అవుతుంటే తెరకు కళ్లప్పగించడం తప్ప ఇంకేమీ చేయలేం. ఒక్కసారి ఆ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టాక ప్రతి దృశ్యం అద్భుతంగానే అనిపిస్తుంది. విరామ సన్నివేశం నుంచి చివరి వరకు ఒక మ్యాజిక్ లాగా సాగే ‘కాంతార: చాప్టర్-1’.. ప్రథమార్ధంలోని తప్పులన్నింటినీ మాఫీ చేసేస్తుంది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని మిగులుస్తుంది.
 
‘కాంతార: చాప్టర్-1’ ట్రైలర్లో భారీతనం ఉన్నా.. 
కథ పరంగా ఏమంత నవ్యత కనిపించకపోవడం ప్రేక్షకుల్లో సినిమా మీద కొంతమేర అంచనాలను తగ్గించిన మాట వాస్తవం. నేపథ్యం భిన్నమైనదే అయినప్పటికీ.. ఒక మహారాణి.. ఒక అడవి మనిషి మధ్య సగటు ప్రేమకథ నేపథ్యంలో సాగే సగటు సినిమాలా కనిపించింది ‘కాంతార: చాప్టర్-1’. మనం ఏదో ఆశిస్తే రిషబ్ ఇంకేదో చూపించడానికి ప్రయత్నించాడనే ఫీలింగ్ కలిగించింది ట్రైలర్. సినిమా కూడా ఒక దశ వరకు ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురి చేస్తూనే సాగుతుంది. ఇటువైపు ఒక రాజ్యం.. అటువైపు అడవిలో ఒక తెగ.. వీరి మధ్య ఆధిపత్య పోరాటం.. మరోవైపు రాణి-తెగ నాయకుడికి మధ్య ప్రేమ సన్నివేశాలతో సాధారణంగానే సాగిపోతుందీ చిత్రం. విజువల్స్ గొప్పగా అనిపించినా.. కథ పరంగా ఏమంత ఎగ్జైట్మెంట్ కలగదు. పైగా ఎక్కువగా కామెడీ ప్రధానంగా సన్నివేశాలు సాగడంతో ‘కాంతార-2’ నుంచి మనం కోరుకున్నది ఇదా అనే ఫీలింగ్ కలుగుతుంది. 

తొలి గంటలో ‘కాంతార’ మీద పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారినట్లే అనిపిస్తుంది. కానీ విరామం దగ్గర ‘కాంతార: చాప్టర్-1’ అసలు సత్తా బయటికి వస్తుంది. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టంతో రిషబ్ విజువల్ మాయాజాలం మొదలవుతుంది. ఇక ద్వితీయార్ధంలోకి అడుగుపెట్టాక ప్రేక్షకులకు కళ్లార్పలేరు. కథలో కూడా అక్కడి నుంచే రక్తి కడుతుంది. అప్పటిదాకా కామెడీగా కనిపించే విలన్ పాత్ర సీరియస్ గా మారడం.. కాంతార మీదికి అతను దండెత్తి రావడంతో కథలో తీవ్రత పెరుగుతుంది. అప్పటిదాకా సాధారణంగా అనిపించే హీరో పాత్ర కూడా ఒక్కసారిగా పరిణామం చెందడం.. ‘కాంతార’లో హైలైట్ అయిన ఎలిమెంట్ ఇందులోనూ కనిపించడంతో ప్రేక్షకులు గొప్ప అనుభూతికి గురవుతారు. 

ఇక చివరి వరకు 
‘కాంతార: చాప్టర్-1’ ఇదే తీవ్రతతో సాగి ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేస్తుంది. అద్భుతంగా అనిపించే విజువల్స్.. కళ్లు చెదిరే ఎఫెక్ట్స్.. కథలో వచ్చే మలుపులు.. భారీతనంతో సాగే పతాక సన్నివేశాలు.. ‘కాంతార: చాప్టర్-1’ను వేరే స్థాయిలో నిలబెడతాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ద్వితీయార్ధం మొత్తం అత్యద్భుతంగా సాగే రిషబ్ శెట్టి నటన మరో ఎత్తు. కేవలం తన పెర్ఫామెన్సుతోనే టికెట్ డబ్బులు గిట్టుబాటు అయిపోతాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి నటన అరుదు అనిపించేలా సాగుతుంది తన పెర్ఫామెన్స్. ఒకే సమయంలో నటుడిగా.. దర్శకుడిగానూ అతను విశ్వరూపం చూపించాడు. ఈ మేలు కలయికే ‘కాంతార: చాప్టర్-1’కు మేజర్ హైలైట్. ప్రథమార్ధంలో చోటు చేసుకున్న లోటుపాట్లన్నీ కూడా భర్తీ అయిపోయేలా ద్వితీయార్ధం ఉండడంతో అంతిమంగా ‘కాంతార: చాప్టర్-1’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిలుస్తుంది. 

‘కాంతార: చాప్టర్-2’ మీద మరిన్ని అంచనాలు రేకెత్తిస్తూ సినిమా ముగుస్తుంది. 
నటీనటులు: ‘కాంతార’ పతాక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన చూశాక దాన్ని మించి పెర్ఫామ్ చేయడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ రిషబ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మరింత అబ్బురపరిచే నటనతో కట్టి పడేశాడు. దేవుడు పూనినపుడు తన నటనను ఇంతకుముందు అనుభూతి చెందినా సరే.. ఈసారి మళ్లీ ఆశ్చర్యపోతాం. సెకండాఫ్ మొత్తం అతడి పెర్ఫామెన్స్ వేరే లెవెల్లో సాగింది. అడవిలో విశ్వరూపం చూపించే సన్నివేశం గురించైతే ఎంత చెప్పినా తక్కువే. పతాక సన్నివేశాల్లో కూడా రిషబ్ నటన సంచలన రీతిలో సాగింది. ‘సప్తసాగరాలు దాటి’ తర్వాత వరుసగా నిరాశపరుస్తున్న రుక్మిణి వసంత్ కు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచే పాత్ర దక్కింది. 

ఇటు అందం.. అటు అభినయంతో ఆమె ఆకట్టుకుంది. ఇప్పటిదాకా రుక్మిణిలో చూడని కోణాన్ని ఇందులో చూస్తాం. తన పాత్రలోని భిన్నకోణాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య బాగానే చేసినా.. అతణ్ని సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. తన పాత్ర ఇవ్వాల్సినంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. వయసు మీద పడ్డ రాజు పాత్రలో జయరాం ఆకట్టుకున్నాడు. ప్రకాష్ తుమినాడ్.. మిగతా ఆర్టిస్టులందరూ బాగానే చేశారు. 

సాంకేతిక వర్గం: 
సాంకేతికంగా ‘కాంతార: చాప్టర్-1’ అత్యున్నత స్థాయిలో సాగింది. ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో విజృంభించాడు. ద్వితీయార్ధంలో సన్నివేశాలకు తగ్గట్లే తన ఆర్ఆర్ పతాక స్థాయిలో సాగింది. పాటలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు. నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో సాగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువ. హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. 

ఇక తనకు సమకూరిన వనరులన్నింటినీ గొప్పగా ఉపయోగించుకుంటూ రైటర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. కథాకథనాల్లో.. సన్నివేశాల్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు. ప్రథమార్ధంలో కాస్త బోర్ కొట్టించి ఉండొచ్చు. కానీ ఇలాంటి విభిన్నమైన కథను తెరపైకి తీసుకురావడంలో రిషబ్ పడ్డ కష్టాన్ని.. అతడి తపనను ఎంత కొనియాడినా తక్కువే. ప్రేక్షకులకు విజువల్స్ రూపంలో.. నటన పరంగా గొప్ప అనుభూతిని పంచడానికి అతను పెట్టిన ఎఫర్ట్ గొప్పది. కాబట్టే ప్రథమార్ధం బోర్ కొట్టించినా.. సినిమాలో లోపాలున్నా.. వాటిని మన్నించొచ్చు. 

చివరగా: కాంతార చాప్టర్-1.. మరో మాయా ప్రపంచం 
రేటింగ్- 3/5