SPORTS NEWS: మహిళల వన్డే ప్రపంచ కప్ మంగళవారం నుంచి మొదలుకానుంది. దీనికి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆసియా కప్ అయిపోయింది.. టీమ్ ఇండియా విజేతగానూ నిలిచింది. అది కూడా పాకిస్థాన్ ను ఓడించి మరీ టైటిల్ కొట్టింది. ఈ కప్ లో మొత్తం మూడు మ్యాచ్ లలోనూ టీమ్ ఇండియానే విజేతగా నిలిచింది. ఇక ఫైనల్లో హైదరాబాదీ తిలక్ వర్మ దుమ్మురేపడంతో తెలుగువారంతా ఖుషీ అయిపోయారు. ఇంతలో మళ్లీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వచ్చేసింది. అది కూడా వచ్చే ఆదివారమే. అక్టోబరు 5న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
వేడి చల్లారకముందే...
పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక పర్యటకులను కాల్చిచంపడం.. ఆ తర్వాత పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసమే లక్ష్యంగా మన ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో భారత్-పాక్ మధ్య సంబంధాలు వేడెక్కాయి. ఇలాంటి సమయంలో వచ్చింది ఆసియా కప్. ఇందులో టీమ్ ఇండియా ఆడుతుందా..? ఆడినా పాకిస్థాన్ తో తలపడుతుందా? అనే అనుమానాలు కలిగాయి. భారత్ ఆడింది.. పాక్ కు బుద్ధిచెప్పింది. అది కూడా కనీసం షేక్ హ్యాండ్ లు ఇవ్వకుండా.. ఫైనల్లో గెలిచాక పాక్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ కూడా స్వీకరించకుండా చెప్పుతో కొట్టినట్లు చేసింది. ఇప్పుడు ఈ వేడి చల్లారకముందే మరో పెద్ద టోర్నీ వచ్చేసింది.
అదే మహిళల వన్డే ప్రపంచ కప్.
మన జట్టు ఈసారి కప్ కొడుతుందా? మహిళల వన్డే ప్రపంచ కప్ మంగళవారం నుంచి మొదలుకానుంది. దీనికి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ కప్ లో తొలి మ్యాచ్ మంగళవారం అసోంలోని గువాహతిలో జరగనుంది. ఇందులో టీమ్ ఇండియా.. శ్రీలంకతో తలపడుతుంది. పురుషుల తొలి వన్డే ప్రపంచ కప్ 1975లో జరగగా మహిళల వన్డే ప్రపంచ కప్ దానికి రెండేళ్ల ముందే 1973లోనే మొదలైంది. ఇలా ఇప్పటివరకు 1978, 1982, 1988, 1993, 1997, 2000, 2005, 2009, 2013, 2017, 2022లలో వన్డే ప్రపంచ కప్ లు జరిగాయి. మొత్తం 12 టోర్నీల్లో ఆస్ట్రేలియా 7, ఇంగ్లండ్ 4, న్యూజిలాండ్ ఒకసారి నెగ్గాయి. టీమ్ ఇండియా మాత్రం ఇంతవరకు టైటిల్ కొట్టలేదు. 2017లో ఫైనల్ చేరినా త్రుటిలో కప్ చేజార్చుకుంది. అయితే, ఈసారి సొంతగడ్డపై ప్రపంచ కప్ జరగనుండడంతో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
వరుసగా నాలుగో ఆదివారం సెప్టెంబరు 14, 21, 28.. వరుసగా పాకిస్థాన్ తో మూడు ఆదివారాలు టీమ్ ఇండియా తలపడి నెగ్గింది. వచ్చే ఆదివారం కూడా పాకిస్థాన్ తో ఆడనుంది. ప్రపంచ కప్ లో భాగంగా పాక్ మహిళల జట్టుతో జరిగే ఈ మ్యాచ్ రెండో ఆతిథ్య దేశమైన శ్రీలంకలో జరగనుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో టీమ్ ఇండియా మహిళలు.. పాక్ మహిళా క్రికెటర్లతో కరచాలనం చేయరనేది ఖాయం. తద్వారా పురుషుల సీనియర్ జట్టు బాటలోనే నడిచి దేశంపై తమ అభిమానాన్ని వ్యక్తం చేయడం మరింత ఖాయం.
