పాక్ సైన్యం భారీ ఆపరేషన్... వణికిపోతున్న సొంత ప్రజలు!


WORLD NEWS: పాకిస్థాన్ సైన్యం భారీస్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలోచిస్థాన్‌ సొంత ప్రజల పైనే దాడులు చేస్తోంది. ఈ సమయంలో పాకిస్థాన్ సైన్యం వాడుతోన్న శతఘ్నులు, మోర్టార్లతో ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. డ్రోన్ దాడులు, నిరంతర షెల్లింగ్ వల్ల ప్రాణనష్టం జరిగిందని నివేదికలు వస్తున్నాయి. 


ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీలో సైనిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు కొనసాగుతున్న ఈ అణచివేత చర్య, కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగించిందని తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మూడు రోజుల పూర్తి లాక్‌ డౌన్ తర్వాత ఇంధనం, ఆహార కొరత తీవ్రంగా పెరుగుతోంది. 

నాలుగవ రోజు పూర్తి లాక్ డౌన్ కొనసాగుతోందని తెలుస్తోంది. పాక్ సైన్యం చేస్తున్న వరుస బాంబు దాడులతో పత్తి పొలాలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని స్థానిక మీడియా పేర్కొంది. ఇదే సమయంలో.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పూర్తిస్థాయి సమాచారం అందుబాటులోకి రావడం లేదు. బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ(బీ.ఎల్.ఏ), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీ.ఎల్.ఎఫ్) లక్ష్యంగా ఈ దాడులు జరుగుతుండగా... వాటి అధీనంలో ఉన్న జెహ్రీని తిరిగి స్వాధీనం చేసుకొనే లక్ష్యంతోనే పాకిస్థాన్ సైన్యం ఈ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో.. దండర్, మోరెంకితో సహా సమీప గ్రామాలు భారీ షెల్లింగ్‌ ను ఎదుర్కొన్నాయి. 

గతనెల ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా లోని మాత్రె దారా గ్రామంపై ఫైటర్‌ జెట్‌ లు ఎల్‌.ఎస్‌-6 రకం 8 బాంబులను జార విడిచిన సంగతి తెలిసిందే. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా గతంలో ఈ ప్రావిన్స్‌ లో దాడులు చేసింది. బలోచిస్థాన్‌ తర్వాత అత్యధికంగా ఉగ్రదాడులు జరిగేది ఈ ప్రావిన్స్‌ లోనే. 

క్వెట్టా నగరం భారీ పేలుడు!: 
పాకిస్థాన్‌ లోని క్వెట్టా నగరం మంగళవారం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఆ వెంటనే కాల్పుల మోత వినిపించింది. పారామిలిటరీ సిబ్బంది లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 10 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారని బలోచిస్థాన్‌ ఆరోగ్య మంత్రి బఖ్త్‌ ముహమ్మద్‌ కకర్‌ తెలిపారు. ఈ సందర్భగా స్పందించిన బలోచిస్థాన్‌ ముఖ్యమంత్రి మిర్‌ సర్ఫ్రాజ్‌ బుగటి.. ఇది ఉగ్రవాదుల ఘాతుకమేనని పేర్కొన్నారు.