ANDHRA PRADESH: కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సెంటర్ కోసం విశాఖలో భూ సేకరణ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. ఈ సమయంలో.. భూ సేకరణలో రైతులకు తెలీకుండా కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు బుధవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం డేటా సెంటర్ భూసేకరణ ప్రగతిని.. ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా స్పందించిన సీఎం...
ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుకు కావాలని ఆటంకాలు సృష్టించే ఆలోచనతో వైసీపీ పెద్దల తరఫున పని చేస్తున్న బినామీల విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు తెలియకుండా వారి పేర్లతో కేసు వేయడం, ఆ పేర్లలో మృతి చెందిన రైతు పేరు ఉండడంపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
ఈ నేపథ్యంలో... గూగుల్ డేటా సెంటర్ కు భూములిచ్చిన రైతులకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలం గురించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా... త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేయాలని వారికి సీఎం సూచించారు.
దక్షిణ కొరియా పెట్టుబడిదారులను అహ్వానించిన మంత్రులు!:
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి, అధికారులు మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా... ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని, వంద రోజుల్లో పనులు ప్రారంభించేలా ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని మంత్రులు.. అక్కడి పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు.
కియా కార్ల పరిశ్రమ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మంత్రులు, అధికారుల బృందం.. ఆ సంస్థ స్ట్రాటజిక్ బిజినెస్ ప్లానింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఆపరేషన్స్ డివిజన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడిదారులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు.
