"మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మాత్రమే" తెలంగాణ డీజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు


TELANGANA: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన శివధర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరికోరి డీజీపీగా నియమించారు. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై స్పందించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతోపాటు సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు రాసిన లేఖపైనా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు డీజీపీ శివధర్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు.


రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించే పోలీసుల పేర్లను పింక్ బుక్ లో రాస్తామని ప్రధాన ప్రతిపక్ష నేత హెచ్చరిస్తుండటాన్ని మీడియా ప్రస్తావించగా, డీజీపీ తనదైన శైలిలో పోలీసు భాషలో జవాబిచ్చారు. తమకు సీఆర్పీసీ, ఐపీపీ వంటి ఖాకీ బుక్ మాత్రమే తెలుసని, పింక్ బుక్, రెడ్ బుక్, బ్లూ బుక్ వంటివి తెలియదని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో పోస్టింగులపై అరెస్టుల విషయం చర్చకు రాగా, సద్విమర్శలను స్వాగతిస్తామని వెల్లడించారు. అంతేకాని ఎదుటివ్యక్తి శీల హననాన్ని మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

డాక్టర్ జితేందర్ స్థానంలో తనకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి డీజీపీ శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తన మొదటి ఛాలెంజ్ స్థానిక సంస్థల ఎన్నికలని డీజీపీ స్పష్టం చేశారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నాయని, ఆ ఖాళీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బేసిక్ పోలీసింగ్‌తో సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామని డీజీపీ వివరించారు.

మరోవైపు మావోయిస్టుల విషయంలోనూ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం సహకరిస్తే సాయుధ పోరాటాన్ని వీడే ఆలోచనలో ఉన్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖను ప్రస్తావిస్తూ పోలీసులు వేధిస్తారని భయపడొద్దని భరోసా ఇచ్చారు. ప్రజా పోరాట పంథా సక్సెస్ అవ్వలేదని మావోయిస్టులే అంగీకరిస్తున్నందున జన జీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వస్తున్నారని, సెంట్రల్ కమిటీ సభ్యురాలు కవితక్క కూడా ఇటీవల లొంగిపోయిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. తెలంగాణలో మావోయిస్టు సమస్య లేనప్పుడు వారితో చర్చలు అనవసరమని డీజీపీ అభిప్రాయపడ్డారు.